Publisher's Synopsis
మృణాళినీ దేవి (1873 - 1902) విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకుర్ సహధర్మచారిణి. రవీంద్రనాథ్, విశ్వభారతి, శాంతినికేతన్ గురించి అంతో - ఇంతో అందరికీ పరిచయమే. రవీంద్రనాథ్ భార్య పేరు మృణాళినీదేవి అని కొందరికి మాత్రమే తెలుసు. అంతకు మించి ఎవరికీ తెలియదు. అతి సామాన్య కుటుంబంలో పుట్టి గ్రామీణ వాతావరణంలో పెరిగిన "భవతారిణి", రవీంద్రనాథ్ తో వివాహబంధం కారణంగా కలకత్తాలో పేరు గాంచిన ఠాకుర్ వంశంలో కోడలుగా అడుగు పెట్టింది. తర్వాత రవీంద్రునితో "మృణాళిని"గా తాదాత్మయతతో జీవిత యాత్ర మొదలు పెడుతుంది. ఆమె స్నేహశీలి. గృహిణిగా అంత చిన్నవయసులోనే కుటుంబంలో అందరినీ ఆప్యాయతతో ఆదరిస్తూ వాళ్ళ మన్ననలు పొందింది. ఆమె మనసులో భర్త యెడల ప్రేమానురాగాలతో పాటు, ఆయన ఆదర్శాలు, ఆశయాల పట్ల కూడా అమితమైన గౌరవం. భర్త కర్మపథం లో సుఖ-దుఃఖాలను పంచుకుంటూ శాంతినికేతన్ లో ఆదర్శ విద్యాలయ స్థాపనలో నిరంతరం చేదోడు-వాదోడుగా సహకరించింది. పందొమ్మిది సంవత్సరాల వైవాహిక జీవితంలో భర్తకు అత్యంత ప్రేమాస్పదురాలై, గృహస్థు జీవితంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొంటున్న సమయంలో కేవలం ఇరువయి తొమ్మిది సంవత్సరాల వయసులో స్వర్గస్థురాలయింది, ఈ పుస్తకంలో రవీంద్రనాథ్ తన భార్యకు రాసిన ఆంతరంగిక ఉత్తరాలు, ఆమె స్మృతిలో రాసిన కవితలు, కొన్ని సంస్మరణాత్మక వ్యాసాల ద్వారా మృణాళినీ దేవి జీవితం, ఆమె వ్యక్తిత్వంలోని విశిష్టతలు ప్రతిబింబిస్తాయని నా విశ్వాసం .
-డా. పి. మాణిక్యాంబ 'మణి'